![]() |
![]() |
బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ నటించిన భారీ యాక్షన్ ఎంటర్టైనర్ 'ధురంధర్' సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించిన ఈ సినిమా, పొరుగు దేశం పాకిస్థాన్‌లో మాత్రం తీవ్ర వివాదాలకు దారితీసింది. ఈ చిత్రానికి కౌంటర్‌గా, తమ దేశ ప్రతిష్టను చాటిచెప్పేలా పాక్ సినీ మేకర్స్ తెరకెక్కించిన 'మేరా ల్యారీ' (Mera Lyari) చిత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో నవ్వులపాలవుతోంది.
భారీ అంచనాల మధ్య విడుదలైన 'మేరా ల్యారీ' బాక్సాఫీస్ వద్ద కనీసం బోణీ కూడా చేయలేకపోయింది. 'ధురంధర్' చిత్రానికి గట్టి సమాధానం ఇస్తామని గొప్పలు చెప్పుకున్న పాక్ సినీ వర్గాలకు ఈ సినిమా ఫలితం కోలుకోలేని దెబ్బ తీసింది. తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమా మొదటి రోజు కేవలం 22 టికెట్లు మాత్రమే అమ్ముడయ్యాయంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
క్రీడా నేపథ్యంలో సాగే మహిళా ఫుట్‌బాల్ క్రీడాకారిణుల కథగా ఈ చిత్రాన్ని అబూ అలీహా దర్శకత్వంలో రూపొందించారు. పాకిస్థాన్‌లోని ల్యారీ ప్రాంతానికి ఉన్న నెగటివ్ ఇమేజ్‌ను తుడిచివేసి, అక్కడి శాంతిని, గర్వాన్ని చాటిచెప్పేలా ఈ సినిమా ఉంటుందని ఆ దేశ మంత్రులు సైతం ప్రచారం చేశారు. అయితే, కమర్షియల్ హంగులు లేకపోవడం, కథనంలో పట్టు లోపించడంతో ప్రేక్షకులు ఈ సినిమా వైపు కన్నెత్తి కూడా చూడలేదు.
వాస్తవానికి రణవీర్ సింగ్ నటించిన 'ధురంధర్' చిత్రాన్ని పాకిస్థాన్‌లో నిషేధించారు. అయినప్పటికీ, అక్కడి జనం పైరసీ వెర్షన్లను విపరీతంగా చూశారని సమాచారం. దీంతో 'ధురంధర్' ప్రభావం తగ్గించేందుకు అక్కడి సింధ్ ప్రభుత్వం అండతో 'మేరా ల్యారీ'ని ప్రమోట్ చేశారు. ఆయేషా ఒమర్, దాననీర్ మొబీన్ వంటి పాక్ స్టార్స్ నటించినా, థియేటర్లలో ఈ సినిమాకు ఈగలు తోలుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
దీంతో ఈ సినిమాను విడుదలైన మొదటి రోజే అనేక థియేటర్ల నుండి తొలగించినట్లు పాక్ మీడియా కోడై కూస్తోంది. సోషల్ మీడియాలో కూడా ఈ సినిమాపై దారుణమైన ట్రోల్స్ వస్తున్నాయి. "భారతీయ సినిమాలకు పోటీ ఇవ్వడం అంటే మాటలు కాదు.. కనీసం సొంత దేశంలో టికెట్లు కూడా అమ్ముకోలేని పరిస్థితి" అంటూ నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.
వరుసగా రెండు భాగాలుగా వచ్చి వేల కోట్ల వసూళ్లు సాధించిన 'ధురంధర్' క్రేజ్ ముందు, పాకిస్థాన్ మేకర్స్ చేసిన ఈ ప్రయత్నం ఒక పేలవమైన ప్రయోగంగా మిగిలిపోయింది. ప్రస్తుతం ఈ పరాజయం పాక్ సినీ పరిశ్రమలో పెద్ద చర్చకే దారితీసింది. మున్ముందు ఇలాంటి రాజకీయ ప్రేరేపిత సినిమాల కంటే మంచి కంటెంట్ ఉన్న చిత్రాలపై దృష్టి పెట్టాలని సినీ విశ్లేషకులు సూచిస్తున్నారు.
![]() |
![]() |